షేబ దేశపు రాణి సొలొమోను సందర్శన
1 షేబ రాణి సొలొమోను గొప్పతనం గూర్చి విని క్లిష్టమైన ప్రశ్నలతో అతనిని పరీక్షించాలని, గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, ప్రశస్తమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటి గురించి అతనితో మాటలాడింది. 2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటినీ ఆమెకు విడమర్చి చెప్పాడు. అతడు ఆమెకు జవాబు చెప్పలేని గూఢమైన మాట ఏదీ లేకపోయింది.
3 షేబ రాణి సొలొమోను జ్ఞానాన్నీ అతడు కట్టించిన నగరాన్నీ 4 అతని భోజనపు బల్ల మీది పదార్ధాలు, అతని అధిపతులు కూర్చుండడం, అతని సేవకులు కనిపెట్టడం, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలందించేవారు, వారి వస్త్రాలు, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహన బలులు, వీటన్నిటినీ చూసినప్పుడు, ఆమె ఎంతో విస్మయానికి గురైంది.
5 ఆమె రాజుతో "నీ పనులను గురించీ, నీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న సమాచారం నిజమైనదే గాని, నేను వచ్చి నా కళ్ళారా చూసేటంత వరకూ వారి మాటలు నమ్మలేదు. 6 నీ గొప్ప జ్ఞానం గూర్చి సగమైనా వారు నాకు చెప్పలేదు. నిన్ను గూర్చి నేను విన్నదాని కంటే నీ కీర్తి ఎంతో ఎక్కువగా ఉంది. 7 నీ సేవకులెంత భాగ్యవంతులు! ఎల్లకాలం నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యులు. 8 నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు" అని చెప్పింది.