ఏడు సీళ్ళు వేసి ఉన్న గ్రంథం
1 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనకా లోపలా రాసి ఉంది. 2 బలిష్టుడైన ఒక దేవదూత, "ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?" అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను. 3 కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది. 4 ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, "ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు" అన్నాడు.
క్రీస్తు ఆ గ్రంథం విప్పడం
6 సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.