కొరింతులో పౌలు
1 ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు.
2 పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ కనుగొన్నాడు. యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి కొద్ది కాలం క్రితమే ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు. 3 వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
4 అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు. 5 సీల, తిమోతిలు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్కు బోధించడంలో మరింతగా నిమగ్నమయ్యాడు. అతనిలో ఆత్మ కలిగించే ఆసక్తివల్ల యేసే క్రీస్తని యూదులకు బలంగా సాక్షమిస్తున్నాడు.
6 ఆ యూదులు అతనిని ఎదిరించి దూషించారు. అతడు తన బట్టలు దులుపుకుని, "మీ రక్తం మీ తలమీదే ఉండుగాక. నేను నిర్దోషిని. ఇక నుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాను" అని వారితో చెప్పి 7 అక్కడ నుండి వెళ్ళి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకుని ఉంది.
8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు. 9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో, "నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు" అని పౌలుతో చెప్పాడు.
11 అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.