గల్లియో నిర్లక్షం
12 గల్లియో అకయకు గవర్నరుగా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసుకుని వచ్చారు. 13 "వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు" అని ఆరోపణ చేశారు.
14 పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, "యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే. 15 ఇది ఏదో ఉపదేశం గురించో, పేరుల గురించో, మీ ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు" అని యూదులతో చెప్పి 16 వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపివేశాడు.
17 అప్పుడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.