ఆలయంలో యూదులు పౌలును బంధించడం
27 ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియ నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకుని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి 28 "ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు" అని కేకలు వేశారు.
29 ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడని వారు భావించారు. 30 పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
31 వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది. 32 వెంటనే అతడు సైనికులనూ, శతాధిపతులనూ వెంటబెట్టుకుని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.