విశ్వాసుల ప్రవర్తన, సేవ
1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. 4 ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.
తన శరీరం కోసం క్రీస్తు ఇచ్చిన పరిచర్య వరాలు
7 అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి. 8 దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది. 9 "ఆరోహణమయ్యాడు" అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా. 10 అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
పరిచర్య వరాల ఉద్దేశం
11,12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.