ప్రభువువైన దేవుడు గొర్రెల కాపరి
11 యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే "నేనే స్వయంగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. 12 తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి, 13 ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.
14 నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి. 15 నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను." ఇదే యెహోవా ప్రభువు సందేశం. 16 "తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.