చివరి రాత్రి భోజనం
1 అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన ప్రేమించాడు. చివరి వరకూ ఆయన వారిని ప్రేమించాడు.
యేసు తన శిష్యుల పాదాలు కడగడం
2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు. 3 తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4 ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.