తన గురించి ఎక్కువగా ఊహించుకునే అతిథి
7 ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు, 8 "నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు. 9 మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి, ‘ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు. 10 కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది.