నజరేతులో యేసు
1 యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు 2 విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. "ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి? 3 ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!" అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.
4 యేసు వారితో, "ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది" అని అన్నాడు. 5 అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు. 6 వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
మత్తయి 10:1-42; లూకా 9:1-6