9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు, "మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు" అని యేసు వారికి ఆజ్ఞాపించాడు. 10 అప్పుడు శిష్యులు, "మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు?" అని అడిగారు.
11 అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, "ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే. 12 అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే, ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గానీ వారు అతణ్ణి గుర్తించలేదు. పైగా, అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు." 13 బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
మార్కు 9:14-29; లూకా 9:37-43