Pular para o conteúdo
Publicidade

రోమీయులకు రాసిన పత్రిక 8:28-39

(4) సువార్త మూలంగా దేవుడు ఉద్దేశించిన అమోఘమైన ఫలితాలు

28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? 33 దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. 34 ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.

(5) విశ్వాసి భద్రత

35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

"నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు."

37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38,39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.