Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 40

ప్రధాన సంగీతకారుడి కోసం. దావీదు కీర్తన

1 యెహోవా కోసం నేను సహనంతో వేచి ఉన్నాను. ఆయన నా మాటలు విన్నాడు. నా మొర ఆలకించాడు.

2 భీకరమైన గుంటలో నుండి, జారుడు మట్టితో నిండి ఉన్న ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదాలను రాయిపై నిలబెట్టాడు. నా అడుగులు స్థిరం చేశాడు.

3 తనకు స్తుతులు చెల్లించే ఒక కొత్త పాటను మన దేవుడు నా నోట్లో ఉంచాడు. అనేకమంది దాన్ని చూసి ఆయన్ని కీర్తిస్తారు. యెహోవాలో నమ్మకముంచుతారు.

4 యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ40:4 అహంకారులనూ విగ్రహాలను పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి.

5 యెహోవా నా దేవా, నువ్వు చేసిన ఆశ్చర్యకరమైన పనులు అసంఖ్యాకంగా ఉన్నాయి. మా కోసం నీకున్న ఆలోచనలు లెక్కించడానికి వీల్లేనంత ఉన్నాయి. ఒకవేళ నేను వాటి గురించి చెప్పాలనుకుంటే అవి లెక్కకు అందనంత ఎక్కువ ఉన్నాయి.

6 నీకు బలులన్నా, నైవేద్యాలన్నా సంతోషం ఉండదు. అయితే నువ్వు నా చెవులు తెరిచావు. దహన బలులుగానీ పాపం కోసం చేసే బలులు గానీ నీకు అక్కర లేదు.

7 అప్పుడు నేను ఇలా చెప్పాను. ఇదిగో, నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చాను.

8 నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం.

9 నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు.

10 నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

11 యెహోవా, నా కోసం నువ్వు కనికరంతో చేసే పనులను నా నుండి దూరం చేయకు. నీ నిబంధన కృప, నీ విశ్వసనీయత ఎప్పుడూ నన్ను కాపాడనీ.

12 అసంఖ్యాకమైన ఆపదలు నన్ను చుట్టుముట్టాయి. నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయి. దాంతో నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. అవి నా తల వెంట్రుకలకంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. నా గుండె జారిపోయింది.

13 యెహోవా, దయచేసి నన్ను కాపాడు. నాకు సహాయం చేయడానికి వేగిరపడు.

14 నా ప్రాణం తీయాలని నా వెంటపడే వాళ్ళు సిగ్గుపడేలా, అయోమయానికి గురయ్యేలా చెయ్యి. నన్ను గాయపరచాలని చూసేవాళ్ళు వెనక్కి మళ్లేలా, అవమానానికి గురయ్యేలా చెయ్యి.

15 నన్ను చూసి ఆహా, ఆహా అనే వాళ్ళు తమకు కలిగిన అవమానం చూసి విభ్రాంతి చెందాలి.

16 నీ కోసం చూసే వాళ్ళంతా నీలో సంతోషించి, ఆనందిస్తారు గాక! నీ రక్షణను ప్రేమించే వాళ్ళంతా "యెహోవాకు స్తుతి" అని చెబుతారు గాక!

17 నేను పేదవాణ్ణి. అవసరాల్లో ఉన్నాను. అయినా ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు. నా సహాయం నువ్వే. నన్ను కాపాడటానికి నువ్వు వస్తావు. నా దేవా, ఆలస్యం చేయకు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.