ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి హెచ్చరికలు
1 సహోదరీ సహోదరులారా, మీరు సత్యం తెలియనివారిగా ఉండాలని నేను కోరడంలేదు. మన పూర్వికులందరూ మేఘం క్రింద ఉన్నారు. సముద్రం గుండా ప్రయాణించారు. 2 వారందరు మేఘంలో సముద్రంలో మోషే బట్టి బాప్తిస్మం పొందారు. 3 వారందరు ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. 4 అందరు ఒకే ఆత్మీయ నీటిని త్రాగారు. ఎందుకంటే తమతో కూడా ఉన్న ఆత్మీయ బండ నుండి వారు త్రాగారు, ఆ బండ క్రీస్తు. 5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.
6 వారిలా మన హృదయాలను చెడ్డ విషయాలపై నిలుపకుండా ఈ సంగతులు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. 7 వారిలో కొందరిలా మీరు విగ్రహారాధికులుగా ఉండకండి: "ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు,"10:7 నిర్గమ 32:6 అని వారి గురించి వ్రాయబడింది. 8 వారిలా మనం లైంగిక దుర్నీతికి పాల్పడకూడదు. వారిలో కొందరు అలా చేయడం వలన ఒక్క రోజులోనే ఇరవై మూడువేలమంది చనిపోయారు. 9 వారిలో కొందరు శోధించినట్లుగా మనం క్రీస్తును శోధించకూడదు, అలా శోధించినవారు సర్పాల వల్ల చనిపోయారు. 10 వారిలా మనం సణుగకూడదు, వారిలో కొందరు సణిగి నాశనం చేసే దూత వలన చనిపోయారు.
11 మనకు ఉదాహరణలుగా ఉండడానికి ఈ సంగతులు వారికి సంభవించి, రాబోయే యుగాంతంలో మనకు హెచ్చరికగా ఉండడానికి వ్రాయబడ్డాయి. 12 కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.