Pular para o conteúdo
Publicidade

1 కొరింథీ పత్రిక 12

ఆత్మ సంబంధమైన వరాలు

1 సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. 2 మీరు దేవుని ఎరుగనివారిగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు. 3 అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ "యేసు శాపగ్రస్తుడు" అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ "యేసే ప్రభువు" అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. 5 అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. 6 అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.

7 అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. 8 ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని, 9 ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు. 10 ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు. 11 ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.

శరీరంలో ఏకత్వం భిన్నత్వం

12 ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు. 13 అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదేతరులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు. 14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.

15 "నేను చేయి కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను" అని పాదం చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. 16 "నేను కన్ను కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను" అని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. 17 శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు? 18 అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదాన్ని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచారు. 19 అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? 20 కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే.

21 కాబట్టి, "నీతో నాకు అవసరం లేదు!" అని కన్ను చేతితో చెప్పకూడదు. "మీతో నాకు పనిలేదు!" అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు. 22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, 23 ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా, 24 అందంగా ఉన్న శరీర అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవం లేని అవయవాలకు అధిక గౌరవం కలుగడానికి దేవుడే మన శరీరాన్ని ఒక్కటిగా చేశారు. 25 అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగి ఉండడానికి ఆయన అలా చేశారు. 26 ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.

27 కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. 28 దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు. 29 అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతాలు చేయగలరా? 30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? 31 కాబట్టి శ్రేష్ఠమైన కృపావరాలను ఆసక్తితో కోరుకోండి.

ప్రేమ అత్యవసరమైనది

ఇదే కాకుండా, అన్నిటికంటే శ్రేష్ఠమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తాను.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.