12 మీ నుండి సహాయం పొందడానికి ఇతరులకు హక్కు ఉంటే, మాకు మరి ఎక్కువ హక్కు ఉండదా?
అయితే, ఈ హక్కును మేము ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఆటంకంగా ఉండకూడదని అన్ని ఇబ్బందులను మేము సహిస్తున్నాము.
13 దేవాలయంలో పని చేసేవారు దేవాలయం నుండే తమ ఆహారాన్ని పొందుతారని, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠం మీద అర్పించిన వాటిలో పాలిభాగస్థులని మీకు తెలియదా? 14 అలాగే, సువార్తను ప్రకటించేవారు సువార్త వల్లనే తమ జీవనోపాధి పొందుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించారు.
15 కాని, నేనైతే వీటిలో దేన్ని ఉపయోగించుకోలేదు. నా పట్ల మీరు ఇలా చేయాలని ఈ సంగతులు వ్రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవరైనా వట్టిదిగా చేస్తే దానికన్నా నాకు మరణమే మేలు. 16 సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ! 17 నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను. 18 అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.