సొలొమోను భార్యలు
1 రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు చాలామంది పరదేశి స్త్రీలను అనగా మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ ప్రజల్లోని స్త్రీలను ప్రేమించాడు. 2 "మీరు వారితో పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే వారు ఖచ్చితంగా మీ హృదయాలను వారి దేవుళ్ళ వైపు త్రిప్పుతారు" అని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ దేశాల వారి గురించే చెప్పారు. అయినప్పటికీ, సొలొమోను వారిని చాలా ప్రేమించాడు. 3 అతనికి రాజకుమార్తెలైన ఏడువందలమంది భార్యలు, మూడువందలమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు. 4 సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు. 5 సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును11:5 మోలెక్ మిల్కోము యొక్క వేరే రూపం అనుసరించాడు. 6 కాబట్టి సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు; తన తండ్రియైన దావీదులా యెహోవాను సంపూర్ణంగా వెంబడించలేదు.
7 సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు. 8 తన పరదేశి భార్యలు తమ దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పించడానికి ఇలా చేశాడు.
9 సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుసరించక, తన హృదయం త్రిప్పుకున్నందుకు యెహోవా అతని మీద చాలా కోప్పడ్డారు. 10 ఇతర దేవుళ్ళను అనుసరించకూడదు అని సొలొమోనుతో యెహోవా చెప్పినా, సొలొమోను ఆయన ఆజ్ఞను పాటించలేదు. 11 కాబట్టి యెహోవా సొలొమోనుతో ఇలా అన్నారు, "నీ వైఖరి ఇలా ఉన్నది కాబట్టి, నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధనను, నా శాసనాలను పాటించలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ నుండి ఈ రాజ్యాన్ని తీసివేసి నీ పనివారిలో ఒకనికి ఇస్తాను. 12 అయినాసరే, నీ తండ్రియైన దావీదును బట్టి, నీ జీవితకాలంలో అలా చేయను, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను. 13 అయితే అతని నుండి రాజ్యాన్నంతా తీసివేయను కాని నా సేవకుడైన దావీదును బట్టి, నేను ఎన్నుకున్న యెరూషలేమును బట్టి, నేను నీ కుమారునికి ఒక్క గోత్రం ఇస్తాను."