షేబ రాణి సొలొమోనును దర్శించుట
1 షేబ దేశపు రాణి సొలొమోను ఖ్యాతి గురించి విన్నప్పుడు, చిక్కు ప్రశ్నలతో అతన్ని పరీక్షిద్దామని ఆమె యెరూషలేముకు వచ్చింది. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది. 2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు. వివరించలేనంత కష్టమైనది అతనికి ఏది లేదు. 3 షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని, అతడు కట్టించిన రాజభవనాన్ని, 4 అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, తమ ప్రత్యేక వస్త్రాల్లో ఉన్న పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.
5 ఆమె రాజుతో, "మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. 6 అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, మీ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి సగం కూడా నాకు చెప్పలేదు; నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. 7 మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో! 8 మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలని ఆయనకున్న కోరికను బట్టి, నీతిన్యాయాల ప్రకారం కార్యాలు చేయడానికి యెహోవా మిమ్మల్ని వారిమీద రాజుగా చేశారు" అని అభినందించింది.