5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:
6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి,
దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;
7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని
తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని
మనుష్యుని పోలికగా పుట్టారు.
8 మనుష్యునిగా కనబడి
మరణానికి విధేయత చూపించడం ద్వారా
అనగా సిలువ మరణం పొందేంతగా
తనను తాను తగ్గించుకున్నారు!
9 అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి
అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,
10 యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు,
పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది,
తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.