కేఫాను వ్యతిరేకించిన పౌలు
11 కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినపుడు, అతడు తప్పు చేశాడు కాబట్టి నేను అతన్ని ముఖాముఖిగా నిలదీశాను. 12 ఎందుకంటే, యాకోబు దగ్గరి నుండి కొందరు మనుష్యులు రాకముందు అతడు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. కాని వారు వచ్చినప్పుడు, అతడు సున్నతి చేయబడిన వారికి భయపడి వెనుకకు తగ్గి యూదేతరుల నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. 13 ఇతర యూదులు కూడా అతని వేషధారణలో జత కలిశారు, దాని ఫలితంగా బర్నబా కూడా వారి వేషధారణను బట్టి దారితప్పాడు.