Pular para o conteúdo
Publicidade

ఆది 45:1-15

యోసేపు తనను తాను తెలియజేసుకోవడం

1 అప్పుడు యోసేపు తన సేవకులందరి ఎదుట తనను తాను అదుపు చేసుకోలేక, "అందరిని నా ఎదుట నుండి పంపివేయండి!" అని బిగ్గరగా చెప్పాడు. తన సోదరులకు తనను తాను తెలియపరచుకున్నప్పుడు యోసేపుతో ఎవరు లేరు. 2 అతడు ఈజిప్టువారు వినేటంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఫరో ఇంటివారు దాని గురించి విన్నారు.

3 యోసేపు తన సోదరులతో, "నేను యోసేపును! నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?" అని అన్నాడు. అతన్ని చూసి అతని సోదరులు కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.

4 యోసేపు తన సోదరులతో, "నా దగ్గరకు రండి" అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, "నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని! 5 ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు. 6 ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు. 7 అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు.

8 "కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు. 9 ఇప్పుడు నా తండ్రి దగ్గరకు వెంటనే వెళ్లి అతనితో, ‘నీ కుమారుడైన యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద ప్రభువుగా చేశారు. నా దగ్గరకు వచ్చేయండి; ఆలస్యం చేయకండి! 10 మీరు, మీ పిల్లలు, మీ మనవళ్లు, మీ మందలు, మీ పశువులు, మీతో ఉన్న సమస్తం గోషేను ప్రాంతంలో నాకు సమీపంగా ఉండవచ్చు. 11 ఇంకా రాబోయే అయిదు సంవత్సరాలు కరువు ఉంటుంది అయితే అక్కడ మిమ్మల్ని నేను పోషిస్తాను. లేకపోతే మీకు మీ ఇంటివారికి పేదరికం ఏర్పడుతుంది.’

12 "మాట్లాడుతుంది నిజంగా నేనే అని స్వయంగా మీరు, నా తమ్ముడైన బెన్యామీను చూడవచ్చు. 13 ఈజిప్టులో నాకు ఇవ్వబడిన ఘనత గురించి, మీరు చూసిన ప్రతి దాని గురించి నా తండ్రికి చెప్పండి. నా తండ్రిని ఇక్కడకు త్వరగా తీసుకురండి" అని చెప్పాడు.

14 తర్వాత తన సోదరుడైన బెన్యామీనుపై మెడ మీద చేతులు వేసి, ఏడ్చాడు, బెన్యామీను అతన్ని హత్తుకుని ఏడ్చాడు. 15 తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. తర్వాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.