15 అప్పుడు దేవుడు నోవహుతో, 16 "నీవూ, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, ఓడలో నుండి బయటకు రండి. 17 నీతో ఉన్న ప్రతి జీవిని అంటే పక్షులు, జంతువులు, నేల మీద ప్రాకే ప్రాణులన్నిటిని బయటకు తీసుకురా, అప్పుడు అవి భూమి మీద ఫలించి, వృద్ధి చెంది, విస్తరిస్తాయి" అని అన్నారు.
18 నోవహు, తన భార్య, కుమారులు, కుమారుల భార్యలతో పాటు బయటకు వచ్చాడు. 19 జంతువులు, నేల మీద ప్రాకే జీవులు, పక్షులు, భూమి మీద తిరిగే జీవులన్నీ ఒక జాతి వెంబడి మరో జాతి, వాటి వాటి జంటల ప్రకారం ఓడలో నుండి బయటకు వచ్చాయి.