తన శిష్యుల పాదాలను కడిగిన యేసు
1 పస్కా పండుగకు ముందే యేసు తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్లవలసిన సమయం వచ్చిందని గ్రహించారు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన అంతం వరకు ప్రేమించారు.
2 వారు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు. 3 తండ్రి అన్నిటిని తనకు అప్పగించాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తాడని యేసుకు తెలుసు. 4 కాబట్టి ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువాలును నడుముకు కట్టుకున్నారు. 5 ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్లు పోసి, తన శిష్యుల పాదాలు కడిగి తాను కట్టుకుని ఉన్న తువాలు తీసి దానితో పాదాలు తుడవడం మొదలుపెట్టారు.
12 ఆయన వారి పాదాలు కడిగి, తన పైవస్త్రాన్ని వేసుకుని తన కూర్చున్న చోటికి తిరిగివెళ్లి, "నేను చేసింది మీకు అర్థమైందా?" అని ఆయన వారిని అడిగి ఇలా చెప్పడం మొదలుపెట్టారు: 13 "అవును, మీరు నన్ను ‘బోధకుడని, ప్రభువని’ పిలుస్తున్నారు. అది నిజమే కాబట్టి మీరలా పిలువడం న్యాయమే. 14 నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ పాదాలు కడిగాను, కాబట్టి మీరు కూడ ఒకరి పాదాలు ఒకరు కడగాలి. 15 నేను మీ కోసం చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను. 16 ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో చెప్పేది నిజం. 17 ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వాటిని పాటిస్తే మీరు ధన్యులు.