యేసు పుట్టుక
1 ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాపించాడు. 2 (ఇది కురేనియు సిరియా దేశాధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.) 3 ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు.
4 కాబట్టి యోసేపు కూడా దావీదు వంశస్థుడు కాబట్టి, అతడు గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి, యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే దావీదు పట్టణానికి వెళ్లాడు, ఎందుకంటే అతడు దావీదు వంశస్థుడు. 5 తనతో పెండ్లికి ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉన్న మరియతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. 6 వారు అక్కడ ఉన్నపుడు, ఆమె నెలలు నిండి, తన మొదటి కుమారుని కన్నది. 7 సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కాబట్టి ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది.
8 ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు. 9 ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు. 10 అయితే ఆ దూత వారితో, "భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను. 11 దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.2:11 క్రీస్తు అంటే మెస్సీయా అని అర్థం 12 మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు" అని చెప్పాడు.
13 అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,
14 "అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ,
ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక."
15 ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, "రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం" అని చెప్పుకొన్నారు.
16 కాబట్టి వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు 17 వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్నవారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. 19 అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది. 20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు.