8 ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు. 9 ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు. 10 అయితే ఆ దూత వారితో, "భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను. 11 దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.2:11 క్రీస్తు అంటే మెస్సీయా అని అర్థం 12 మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు" అని చెప్పాడు.
13 అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,
14 "అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ,
ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక."
15 ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, "రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం" అని చెప్పుకొన్నారు.
16 కాబట్టి వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు 17 వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్నవారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. 19 అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది. 20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు.