జ్ఞానం క్షేమాన్ని కలిగిస్తుంది
1 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు,
నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో,
2 అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి,
నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి.
3 ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు;
నీ మెడలో వాటిని ధరించుకో,
నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో.
4 అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను
దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు.
5 నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు
నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
6 నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు,
అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.
7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;
యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.
8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం,
నీ ఎముకలకు బలం కలుగుతుంది.