పాపానికి మరణం, క్రీస్తులో జీవం
1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? 2 ఎన్నడు అలా చెప్పకూడదు. పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం? 3 క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా? 4 తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము.
5 మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము. 6 మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా,6:6 లేదా శక్తి లేనిదిగా అయ్యేలా మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. 7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు.
8 కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. 9 క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు. 10 ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.