నీచమైన పనులు
9 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు. 10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, 11 ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు. 12 వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.
13 మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. 14 మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.