Pular para o conteúdo
Publicidade

ద్వితీయోపదేశ కాండము 8

యెహోవా దేవుని మర్చిపోకండి

1 "మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి. 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

4 ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు. 5 ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి. 6 ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.

7 ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. 8 దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం. 9 మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.

10 మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి. 11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. 13 మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

15 బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. 16 చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. 17 అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే. 19 మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. 20 యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.