మోషేకి దేవుడిచ్చిన అద్భుత శక్తి
1 అప్పుడు మోషే "వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో" అని జవాబిచ్చాడు.
2 యెహోవా "నీ చేతిలో ఉన్నది ఏమిటి?" అని మోషేను అడిగాడు. అతడు "కర్ర" అన్నాడు.
3 అప్పుడు దేవుడు "ఆ కర్రను నేల మీద పడవెయ్యి" అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.
4 అప్పుడు యెహోవా "నీ చేత్తో దాని తోక పట్టుకో" అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.
5 ఆయన "దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు" అన్నాడు.