మోషే కోసం గుర్తులు
1 అందుకు మోషే, "ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?" అన్నాడు.
2 అప్పుడు యెహోవా అతనితో, "నీ చేతిలో ఉన్నది ఏమిటి?" అని అన్నారు.
"ఒక కర్ర" అని అతడు జవాబిచ్చాడు.
3 అందుకు యెహోవా, "దానిని నేలపై పడవేయి" అన్నారు.
మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు. 4 అప్పుడు యెహోవా, "నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు" అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది. 5 అప్పుడు యెహోవా, "దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు" అని అన్నారు.