Pular para o conteúdo
Publicidade

ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3

విశ్వాసి నమ్మకానికీ, అభిలాషలకీ, ఎదురు చూపులకీ నమూనా

ఫిలిప్పీ 3:1-21

(1) క్రైస్తవులను యూదు మతంలోకి మార్చాలని చూసే వారి విషయం హెచ్చరిక

1 చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు మరలా రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం. 2 కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త. 3 ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.

(2) చట్టసంబంధమైన నీతిని నమ్ముకోవడం

4 చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను. 5 ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి. 6 క్రైస్తవ సంఘాన్ని తీవ్రంగా హింసించాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో నిందారహితుడిని.

(3) నీతి కలిగేలా విశ్వాసికి ఉండే నమ్మకానికి ఆధారం

7 అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటిని క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను. 8 వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును సంపాదించటానికి వాటిని చెత్తతో సమానంగా ఎంచాను. 9 ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.

(4) పునరుత్థాన శక్తితో సహవాసానికై విశ్వాసికి ఆధారం క్రీస్తు

10,11 ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా ఆయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను.

12 వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. 13 సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను. 14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.

(5) ప్రవర్తనలో ఐక్యతకై హెచ్చరిక

15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము.

(6) అయితే ఐక్యత కోసమని సత్యాన్ని నిర్లక్షానికి గురి చేయకూడదు

17 సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి. 18 చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను. 19 నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.

(7) విశ్వాసి నిరీక్షణకు ఆధారం క్రీస్తు

20 ఎందుకంటే మనం అయితే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. 21 సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses