యేసు సబ్బాతుకు కూడా ప్రభువు
23 విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు. 24 పరిసయ్యులు, "చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?" అని ఆయనను అడిగారు. 25 అందుకాయన వారితో ఇలా అన్నాడు, "దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?" అన్నాడు.
27 ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, "విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. 28 అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!" అని వారితో చెప్పాడు.