16 తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు,
"నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను;
తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు.
నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది,
అతడు నిన్ను ఏలుతాడు."
17 ఆదాముతో ఆయన ఇలా అన్నారు, "నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి,
"నిన్ను బట్టి ఈ నేల శపించబడింది;
నీ జీవితకాలమంతా దాని పంట నుండి,
కష్టపడి పని చేసి తింటావు.
18 భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది,
నీవు పొలం లోని పంటను తింటావు.
19 నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి
నీవు మట్టికి చేరేవరకు,
నీ నుదిటి మీద చెమట కార్చి
నీ ఆహారాన్ని తింటావు
నీవు మట్టివి కాబట్టి
తిరిగి మన్నై పోతావు."