యెష్షయి కొమ్మ
1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది;
అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది.
2 యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ,
ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ,
తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ,
అతని మీద ఉంటుంది.
3 యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు.
అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు,
తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు;
4 కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు,
భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు.
అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు;
తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.
5 నీతి అతని నడికట్టుగా ఉంటుంది
నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది.
6 తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది,
చిరుతపులి మేకతో పడుకుంటుంది,
దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి;
చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు.
7 ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి,
వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి.
ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.
8 పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది.
విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది.
9 నా పరిశుద్ధ పర్వతమంతటా
అవి హాని చేయవు, నాశనం చేయవు.
నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు
యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
10 ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.