ద్రాక్షతోట గీతం
1 నా ప్రియుని గురించి పాడతాను.
తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను:
సారవంతమైన కొండమీద
నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.
2 ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి
అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు.
దానిలో కాపలా గోపురం కట్టాడు
ద్రాక్షతొట్టిని తొలిపించాడు.
మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు,
కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.
3 "కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా,
నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.
4 నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే
దానికి ఇంకేమి చేయాలి?
మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే
ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?
5 నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో
ఇప్పుడు మీకు చెప్తాను.
దాని కంచె నేను తీసివేస్తాను
అప్పుడు అది నాశనం అవుతుంది;
దాని గోడను పడగొడతాను
అప్పుడు అది త్రొక్కబడుతుంది.
6 నేను దానిని బంజరు భూమిలా చేస్తాను,
అది త్రవ్వరు, సాగు చేయరు,
అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి.
దానిపై వర్షం కురిపించవద్దని
మేఘాలను ఆజ్ఞాపిస్తాను."
7 ఇశ్రాయేలు వంశం
సైన్యాల యెహోవా ద్రాక్షతోట,
యూదా ప్రజలు
ఆయన ఆనందించే ద్రాక్షలు.
ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది;
నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.