Pular para o conteúdo
Publicidade

యెషయా 58

నిజమైన ఉపవాసం

1 "గట్టిగా కేకలు వేయండి, ఆపకండి.

బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి.

నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి,

యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.

2 ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు;

తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా

నీతిని అనుసరించే దేశంగా

నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు.

తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు,

దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు.

3 వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా

మీరెందుకు చూడరు?

మమ్మల్ని మేము తగ్గించుకుంటే

మీరెందుకు గమనించరు?’

"అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు

మీ పనివారినందరిని దోచుకున్నారు.

4 మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో,

ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది.

మీ స్వరం పరలోకంలో వినపడాలని

మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.

5 ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది?

మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా?

ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని

గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా?

యెహోవాకు ఇష్టమైన ఉపవాసం

ఇదేనని మీరనుకుంటున్నారా?

6 "నేను కోరుకునే ఉపవాసం

అన్యాయపు సంకెళ్ళను విప్పడం,

బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం,

బాధించబడిన వారిని విడిపించడం,

ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?

7 మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం,

ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం,

మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం,

మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?

8 అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది.

మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది;

అప్పుడు మీ నీతి58:8 లేదా మీ నీతిమంతుడు మీ ముందుగా నడుస్తుంది

యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.

9 అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు;

మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు.

"మీరు ఇతరులను బాధించడం,

వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే,

10 ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి,

బాధించబడినవారి అవసరాలను తీరిస్తే,

చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది,

మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.

11 యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు;

కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి

మీ ఎముకలను బలపరుస్తారు.

మీరు నీరు పెట్టిన తోటలా

ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.

12 పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు.

అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు;

మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా,

నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.

13 "నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా

నా సబ్బాతును పాటిస్తే,

సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని

యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే,

దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా,

మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,

14 అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు,

దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను,

మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను."

యెహోవా తెలియజేసిన మాట ఇదే.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.