క్రొత్త ఆకాశం క్రొత్త భూమి
17 "చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని
క్రొత్త భూమిని సృష్టిస్తాను.
గత విషయాలు గుర్తు చేసుకోబడవు.
వాటి గురించి ఎవరూ ఆలోచించరు.
18 అయితే నేను సృష్టించబోయే వాటి గురించి
మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి.
నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా
ప్రజలను ఆనందంగా చేస్తాను.
19 నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను
నా ప్రజల్లో ఆనందిస్తాను;
ఏడ్పు రోదన శబ్దం
ఇకపై దానిలో వినపడవు.
20 "ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే
బ్రతికి ఉండే శిశువులు ఉండరు.
తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు;
వంద సంవత్సరాల వయస్సులో
చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు;
వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే
పాపిని శాపగ్రస్తుడు అంటారు.
21 వారు ఇల్లు కట్టుకుని వాటిలో నివసిస్తారు;
వారు ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు.
22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు.
వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు.
నా ప్రజల ఆయుష్షు
చెట్ల ఆయుష్షంత ఉంటుంది;
నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని
పూర్తిగా అనుభవిస్తారు.
23 వారు వృధాగా కష్టపడరు,
దురదృష్టాన్ని అనుభవించడానికి పిల్లల్ని కనరు;
వారు యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలుగా,
వారు, వారి వారసులు ఉంటారు.
24 వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను;
వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను.
25 తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి,
సింహం ఎద్దులా గడ్డి తింటుంది,
దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది.
నా పరిశుద్ధ పర్వతం మీద
అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు"
అని యెహోవా చెప్తున్నారు.