1 అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.
2 చీకటిలో జీవిస్తున్న ప్రజలు
గొప్ప వెలుగును చూశారు;
చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద
ఒక వెలుగు ప్రకాశించింది.
3 మీరు దేశాన్ని విస్తరింపజేశారు
వారి సంతోషాన్ని అధికం చేశారు;
కోతకాలంలో ప్రజలు సంతోషించినట్లు
దోపుడుసొమ్ము పంచుకుంటున్నప్పుడు
యుద్ధవీరులు సంతోషించినట్లు
వారు మీ ఎదుట సంతోషిస్తున్నారు.
4 మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు,
వారికి భారం కలిగించే కాడిని
వారి భుజాలమీద ఉన్న కర్రను,
వారిని హింసించేవాని కర్రను
మీరు విరిచివేశారు.
5 యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు
రక్తంలో చుట్టబడిన బట్టలు
మంటలో వేయబడతాయి
అగ్నికి ఇంధనంగా అవుతాయి.
6 ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు,
మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు.
ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది.
ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు
నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి
అని పిలువబడతాడు.
7 ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి
ముగింపు ఉండదు.
ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు
దావీదు సింహాసనం మీద,
అతని రాజ్యాన్ని ఏలుతూ,
న్యాయంతోను నీతితోను
రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు.
సైన్యాలకు అధిపతియైన యెహోవా
ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.